- కేయూ రోడ్డులో ఏటా నీట మునుగుతున్న కాలనీలు
- ఆరు నెలల కింద మొంథా తుఫాన్ ఎఫెక్ట్ కాలనీలను పరిశీలించిన సీఎం రేవంత్‍రెడ్డి
- వరద కట్టడికి శాశ్వత చర్యలకు ఆదేశాలు
- 20 కాలనీలకు ముంపు నుంచి విముక్తి కలిగించేలా పనులు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ ట్రైసిటీలోని హనుమకొండ నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు కాలనీలను ముంచెత్తకుండా గోపాల్‌పూర్ ఊర చెరువు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయితే వర్షాకాలంలో వరద ముప్పుతో వణికిపోయే కేయూ–కాజీపేట వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న దాదాపు 20 కాలనీల ప్రజలకు ఊరట లభించనుంది.
నాలుగు చెరువుల వరద ఊర చెరువులోకే..
కాజీపేట ప్రాంతం ఎత్తులో ఉండగా హనుమకొండ, వరంగల్ నగరాలు కింద భాగంలో ఉన్నాయి. వర్షాకాలంలో పైభాగాల నుంచి వచ్చే వరదనీరు కిందకు చేరుతుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల వల్ల రాంపూర్, మడికొండ, సొమిడి చెరువుల నుంచి వచ్చే వరద చివరకు వడ్డెపల్లి చెరువులోకి చేరి అక్కడి నుంచి గోపాల్‌పూర్ ఊర చెరువులోకి ప్రవహిస్తుంది. గతేడాది అక్టోబర్ చివరి వారంలో వచ్చిన మొంథా తుఫాన్ ప్రభావంతో హనుమకొండలోని గోపాల్‌పూర్ ఊర చెరువు పొంగిపొర్లి దాదాపు 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, వివేక్ కాలనీ, గోపాల్‌పూర్, సరస్వతి నగర్, జవహర్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సమ్మయ్య నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నడుము లోతు వరకు వరదనీరు చేరింది. పలువురు నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది.
రిటైనింగ్ వాల్‌తో శాశ్వత పరిష్కారం..
మోంతా తుఫాన్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగరాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ముంపు బాధిత కుటుంబాలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. వరద ముంపు నివారణకు అవసరమైన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరవతో రూ.4 కోట్ల వ్యయంతో ఊర చెరువు గట్టు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు.
దీంతో వరదనీరు కాలనీల్లోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయనున్నారు. చెరువు పరిసరాల్లో ఆక్రమణలను తొలగించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంతో పాటు చెరువును మినీ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నయీంనగర్ పెద్దమోరీ నాలాను వెడల్పు చేసి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కొంతవరకు వరద ముంపు తగ్గింది. ఇప్పుడు ఊర చెరువు వద్ద చేపడుతున్న పనులతో హనుమకొండలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
